* నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ప్రింటింగ్ ప్రారంభం
* బోగస్ ఏరివేత.. పూర్తికాగానే కార్డుల ముద్రణ
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీలో భాగంగా కార్డుల ముద్రణ ప్రక్రియ మొదలుపెట్టింది. కొత్త కార్డుల ముద్రణకు ముందే డేటాబేస్‌ను సరిచూసుకొని బోగస్ ఏరివేత ప్రక్రియను కూడా పూర్తిచేస్తున్నది. ఇదే క్రమంలో కార్డుల ముద్రణకూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బుధవారం పౌర సరఫరాల శాఖమంత్రి ఈటల రాజేందర్ కమిషనర్ రజత్‌కుమార్‌తో కొత్త రేషన్‌కార్డుల పురోగతిపై సమీక్షించారు. కార్డుల ముద్రణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. డేటాబేస్ ఆధారంగా బోగస్‌ను ఏరివేతతో పాటు అటు ఏపీలో.. ఇటు తెలంగాణలో కార్డులున్న వారి పేర్లను ఆధార్ ఆధారంగా తొలగిస్తున్నామని మంత్రికి కమిషనర్ తెలిపారు. కాగా ఇప్పటికే నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినందున ముద్రణ కూడా మొదలైనట్టు తెలిపారు. గులాబీ రంగులో గత కార్డుల సైజులోనే వీటిని రూపొందించన్నారు. ఆధార్ కార్డులోని ఫొటోలతో కొత్త రేషన్ కార్డులు ముద్రిస్తారు. కార్డు మొదటి పేజీలో కార్డుదారుని పేరు, వివరాలు.. రెండోవైపు కుటుంబ సభ్యుల ఫొటోలు వారి వివరాలను పొందుపరుస్తారు. ఒకవేళ ఆరుగురికి మించి సభ్యులుంటే ఈ కార్డుతో పాటు అదనంగా మరో షీట్‌ను జోడించి అందులో మిగతా వారి ఫొటోలు, వివరాలతో పొందుపర్చనున్నారు. కార్డు మొదటి పేజీ పైభాగాన ఎడమవైపు సీఎం కేసీఆర్ ఫోటో.. కుడి పక్క మంత్రి ఈటల రాజేందర్ ఫొటో, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. దాని కిందే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.. ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని ముద్రిస్తారు. కిందిభాగంలో కార్డు నెంబర్, చౌక ధరల దుకాణం నెంబరు, ఇంటి యజమాని పేరు, సభ్యుల సంఖ్య, చిరునామా ఉంటాయి.